Putana Samharam – Rakshasa Samharam – Krishna Stories

శ్రీ కృష్ణుడిచేత  సంహరింపబడ్డ రాక్షసులు:

పుతన సంహారం:

శ్రీ కృష్ణుని బాలలీలలగూర్చి ఎన్నో అద్భుత కథలు వున్నాయి. ప్రపంచ సాహిత్యాలలో దివ్యపురుషులను గూర్చి వారు చేసిన అతిలోక సాహసకృత్యాలు కథలు కథలుగా విస్తరించి వినిపిస్తున్నాయి. బాలకృష్ణుని చేష్టలు సాహసగాథలు భాగవతం దశమస్కంధంలో హృదయంగమంగా వర్ణించబడ్డాయి. కంసుడు పంపగా పూతన అనే రాక్షసి ఖేచరియై వ్రేపల్లెకు వచ్చింది. కామరూపిణియై ఇల్లిల్లు వెదికి వెదకి నందుని గృహంచేరి సుందరీవేషంతో బాలకృష్ణుని అక్కున చేర్చి పాలివ్వటానికి ఉపక్రమించింది. ఆమె చనుగవ విషమయం. శ్రీ కృష్ణుడు సాధారణ శిశుమాత్రుడా ? ఆమె చనుపాలను మాత్రమేగాక ఆమె శరీరజవసత్త్వాలన్నిటిని పీల్చి వేశాడు శ్రీ కృష్ణుడు. ఆమె నేలగూలి ప్రాణాలు కోల్పోయింది. ఆమె కళేబరం నిజస్వరూపంతో నేలకొరిగినప్పుడు యోజన పర్వంతం చేట్టుపుట్టలు గుట్టలు నుగ్గునుగ్గయి పోయాయి.

శకటాసురసంహారం:

ఇలాంటిదే మరియొక వింత శకటాసురసంహారం. రాక్షసుడొకడు శకటరూపంతో శిశువైన శ్రీ కృష్ణుని చేరాడు. అర్భకుడైన కృష్ణుడు ఆ శకటాన్ని తన కాలితో తన్నగా ఆ శకటం ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ విషయం ప్రక్కన ఆడుకునే పిల్లలు యశోదతో చెప్పారు.

తృణావర్తుడు పడిపోయినాడు:

trunavarthudu

అలాంటిదే మరియొక వింత.  తృణావర్తుడనే రాక్షసుడు ఒకనాడు సుడిగాలిరూపంలో వచ్చి బాలకృష్ణుని ఎత్తుకొని గగనమందలానికే ఎగసాడు. అదిచూసి యశోద, ప్రజభామినులు అందరు ఆశ్చర్యచకితులై శోకించారు. అంతలో ఆ దైత్యుడు శ్రీకృష్ణుని బరువు మోయలేక గిజగిజ తన్నుకొని నిజరూపంతో నీలకూలాడు. రక్కసుని గుండెలపై హాయిగా ఆడుకొంటున్న చిన్నకృష్ణుని గోపబాలకులు లీవదీసి తల్లి యశోదదగ్గరికి తీసుకొనివెళ్ళి అప్పగించారు. అప్పుడు గొపగోపికాజనసమూహం ఆ సన్నివేశాన్ని చర్చించి తాము లీలా మానుష బాలకరూపం ధరించిన శ్రీ కృష్ణునకు సమకాలీనులై జన్మించటం తమ అదృష్టవిశేషంగా సంభావించుకొన్నారు .

ఇలా ఆ శ్రీకృష్ణుని చేత సంహరింపబడ్డ రాక్షసులు ఎందరో వున్నారు. చిన్నతనంలో  శ్రీకృష్ణుడు చేసిన అల్లరి-చిలిపి చేష్టలు  గురించి తరువాయి భాగంలో చెప్పుకుందాం…..

Krishna Story part – 1

Leave a Reply